Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్‌కు అండగా ఉంటాం: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా ఫోన్ ద్వారా ప్రత్యక్షమై భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, ఆయనపై తనకు ఎంతో అభిమానముందని తెలిపారు. ఢిల్లీలో అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన భారీ తెరపై ట్రంప్ ప్రత్యక్షమై మాట్లాడటం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్‌తో అమెరికా సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా బలపడాయని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు ఎలాంటి అవసరం వచ్చినా అమెరికా పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
వివరాలు
వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని కొనియాడిన ట్రంప్, "భారత్‌కు అవసరమైన సహాయం అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం" అని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్జియో ద్వారా ప్రధాని మోదీకి వైట్‌హౌస్ సందర్శనకు ఆహ్వానం కూడా అందింది. అలాగే మార్కో రూబియో అమెరికా చరిత్రలో అత్యుత్తమ విదేశాంగ కార్యదర్శుల్లో ఒకరని ట్రంప్ ప్రశంసించారు. భారత్ పర్యటనలో భాగంగా మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుందని రూబియో వెల్లడించారు. ఈ ఒప్పందం రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రపంచ దేశాల మధ్య సమానమైన వాణిజ్య విధానం
వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. అమెరికా తీసుకొచ్చిన కొత్త వలస విధానం, దిగుమతి సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో రూబియో పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వాణిజ్య అసమతుల్యతను తగ్గించడమే తమ లక్ష్యమని, భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోలేదని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల మధ్య సమానమైన వాణిజ్య విధానం అమలుకు తమ చర్యలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.