Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ధాన్యం అమ్మిన వెంటనే అకౌంట్లోకి డబ్బులు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 15 నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్‌లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.18,250 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు
ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వీటిలో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు (PACS), 731 ఇతర కేంద్రాలు ఉంటాయని తెలిపారు.
ఈ కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ 1 నాటికి పూర్తిగా సిద్ధం చేయాలని నిర్ణయించారు.
వివరాలు
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గోదాంలు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం యంత్రాలతో పాటు నాణ్యత నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా.. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వివరాలు
క్వింటాల్‌కు రూ.2,461 వరకు ధర
ధాన్యం కొనుగోలు ధరలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,441 చెల్లించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు చెప్పారు.
బోనస్ పొందే సన్న రకాల ధాన్యంలో
బీపీటీ-5204
ఆర్‌ఎన్‌ఆర్-15048
కేఎన్‌ఎం-1638
జైశ్రీరామ్
హెచ్‌ఎంటీ-సోనా
డబ్ల్యూజీఎల్-44
కేఎన్‌ఎం-7715
ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
వివరాలు
విత్తన రకం నమోదు తప్పనిసరి
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే డీలర్ల వద్ద తాము కొనుగోలు చేసిన విత్తన రకాన్ని నమోదు చేసుకోవాలని సూచించారు.
విత్తన రకాల నమోదుకు డీలర్లే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
రైతులు సాగు చేసిన ధాన్యం ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలలో ఉన్నట్లు నిర్ధారణ అయితే.. వారికి ప్రభుత్వం బోనస్ డబ్బులను అందించనుంది.