Code Words: ఢిల్లీ పేలుడు కుట్రకు 'బిర్యానీ','దావత్' అనే పదాలతో సంభాషించుకున్న వైద్యులు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ పేలుడు కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యులను భద్రతా సంస్థలు లోతుగా ప్రశ్నిస్తున్నాయి. వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, అందులోని వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇదే దర్యాప్తులో ఒక కీలకమైన అంశం బయటపడింది. నిందితుల మధ్య జరిగిన చాట్స్‌లో పలు రహస్య కోడ్ పదాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఉగ్ర గ్రూప్‌లో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ షాహిన్ సాహిద్‌కు వారు 'మేడమ్ సర్జన్' అనే కోడ్ నేమ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇంతే కాదు,మరికొన్ని రహస్య పేర్లూ వెలికి వచ్చాయి.ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా తమ సందేశాలను పంపేటప్పుడు,అనుమానం రాకుండా ఈ ప్రత్యేక పదాలను వారు ఉపయోగించినట్టు విచారణలో తెలిసింది.
వివరాలు
బిర్యానీ రెడీ అయింది… తినేందుకు సిద్ధంగా ఉండు
బిర్యానీ అనే పదాన్ని పేలుడు పదార్థాలకు, దావత్ అనే పదాన్ని దాడి చర్యలకు కోడ్‌గా వాడినట్లు అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ బాంబు పేలుళ్లకు సంబంధమున్న వైద్యులు.. ముజమ్మిల్ షకీల్, ఉమర్ ఉన్ నబీ, షాహీన్ సయీద్, అదీల్ రాదర్.. ఈ కోడ్ పదాల ద్వారానే దాడి ప్రణాళికలపై మాట్లాడుకున్నట్టు బయటపడింది. చాట్స్‌లో కనిపించిన 'బిర్యానీ రెడీ అయింది... తినేందుకు సిద్ధంగా ఉండు' అనే సందేశం వాస్తవానికి బాంబు పూర్తిగా సిద్ధమైందన్న సంకేతమని అధికారులు గుర్తించారు.