Kavitha New Party Launch: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. నూతన పార్టీని ప్రకటించిన కవిత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్‌లో ఉన్న అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆమె తన పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన (TRS)'గా ప్రకటించారు. ఈ పేరు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. శనివారం ఉదయం కవిత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరి, గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 10 గంటలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తరువాత పార్టీ జెండాను ఆవిష్కరించారు.
వివరాలు
'తెలంగాణ రాష్ట్ర సేన' గా నామకరణం
కవిత ప్రకటించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (TRS) కావడం బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi) కు షాక్‌గా మారింది. ఒకప్పుడు ఇదే పేరుతో ఉన్న పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన నేపథ్యంలో ఇప్పుడు అదే పేరును మళ్లీ వినియోగించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సభా ప్రాంగణాన్ని తెలంగాణ సాంస్కృతిక భావజాలాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించారు. వరంగల్ కాకతీయ కళా తోరణం నమూనాలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కె. జయశంకర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.