Vijay: టీవీకే అధినేత విజయ్‌కు బిగ్ షాక్.. కోడ్ ఉల్లంఘనపై కేసు!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ఎన్నికల సందర్బంగా టీవీకే అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని పెరంబూర్ పరిధి పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఫిర్యాదు ప్రకారం, విజయ్ రోడ్‌షో సమయంలో 30 లౌడ్‌స్పీకర్లు వినియోగించడంతో పాటు అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 మందికిపైగా జనాన్ని సమీకరించడం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఎన్నికల నియమావళికి విరుద్ధమని కుమార్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెరవల్లూర్ పోలీసులు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివరాలు
పోలీసులు భద్రత కల్పించలేదు
విజయ్‌తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్ మార్చి 30న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోకు భారీగా జనసంద్రం తరలివచ్చింది. అయితే ఈ వ్యవహారంపై టీవీకే నేతలు చెన్నై పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని, ట్రాఫిక్ నియంత్రణలో విఫలమయ్యారని విమర్శించారు. ఇక ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తమకు భద్రత కల్పించాలని, ప్రచారాల సమయంలో ట్రాఫిక్‌ను సక్రమంగా నియంత్రించాలని టీవీకే కోరింది.
వివరాలు
రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ
అనుమతులు తీసుకున్నప్పటికీ విజయ్‌కు తగిన రక్షణ అందలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, విజయ్ ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌తో పాటు త్రిచీ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో డీఎంకే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆర్‌డీ శేఖర్, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గం 2016 వరకు సీపీఎం ఆధిపత్యంలో ఉండగా, 2019 ఉపఎన్నికలో ఆర్‌డీ శేఖర్ విజయం సాధించి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.