Bihar Assembly Elections: బిహార్ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు.. ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం తొలి గంటల్లోనే అనేక మంది ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించారు. ఎన్నికల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 13.13% పోలింగ్ నమోదైంది. తొలి గంటల్లో ఓటేసిన ప్రముఖులు పట్నాలో ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్, అలాగే లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య ఓటు వేశారు.
వివరాలు
తొలి గంటల్లో ఓటేసిన ప్రముఖులు
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్,బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరయ్‌లో తమ ఓటు హక్కును వినియోగించారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) పట్నాలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ , ఆయన భార్య హజీపూర్‌లో ఓటేశారు. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ ముఖ్యుడు, మహాగఠ్‌బంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముకేశ్ సహనీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్భంగాలో పోలింగ్‌లో పాల్గొన్నారు.
వివరాలు
పోటీలో ఉన్న అభ్యర్థులు,పార్టీ స్థానాలు
ఈ దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్లు మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. తొలివిడత ఎన్నికలకు 45,341 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేడీయూ 57 స్థానాలు, భాజపా 48, ఎల్‌జేపీ 14, ఆర్‌ఎల్‌ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆర్‌జేడీ 73, కాంగ్రెస్ 24, సీపీఐ-ఎంఎల్ 14 చోట్ల పోటీకి నిలిచింది. ప్రశాంత్‌కిశోర్ సారథ్యంలోని జన్‌సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. తొలివిడతలో తేజస్వీతోపాటు భాజపా నేత సామ్రాట్ చౌధరి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొంటున్నారు.