LOADING...
Bihar: ఈ నెల 19 లేదా 20 తేదీన బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది
ఈ నెల 19 లేదా 20 తేదీన బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది

Bihar: ఈ నెల 19 లేదా 20 తేదీన బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో కొత్త కేబినెట్ బాధ్యతలు చేపట్టనుంది. ఈ నెల 19 లేదా 20న ప్రమాణ స్వీకార వేడుక నిర్వహించే అవకాశం ఉంది. మళ్లీ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. పట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార వేదిక కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రేపు నితీశ్‌ క్యాబినెట్‌ సమావేశం జరుగుతుంది. 17వ శాసనసభను రద్దు చేసే తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అనంతరం నితీష్ కుమార్ గవర్నర్‌ను కలిసి రాజీనామా అందజేయనున్నారు.

వివరాలు 

 ప్రమాణస్వీకార వేడుకకు ప్రధాని మోదీ

నితీశ్ రాజీనామా అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ శాసనసభా సమావేశాలను నిర్వహిస్తాయి. ఎమ్మెల్యేలు ఎన్డీఏ శాసనసభా నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ గవర్నర్ అనుమతి కోరనుంది. ప్రమాణస్వీకార వేడుకకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు హాజరవుతారని అంచనా. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ ఐక్యతను, రాజకీయ బలం చూపించేందుకు ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

వివరాలు 

క్యాబినెట్ ఫార్ములా ఇదే.. 

క్యాబినెట్ ఆకృతి ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఖరారైందని తెలిసింది. మంత్రివర్గంలో బీజేపీకి ఎక్కువ స్థానం లభించేలా ప్రణాళిక రూపొందినట్లు సమాచారం. తర్వాత జేడీయూకు గణనీయమైన మంత్రిపదవులు ఇవ్వనున్నారు. చిన్న కూటమి భాగస్వామ్యాలకు కూడా క్యాబినెట్‌లో ప్రాధాన్యం కల్పించేలా జాగ్రత్తపడ్డారు. ఎన్‌డీఏ 'ఆరుగురు ఎమ్మెల్యేలు-ఒక్క మంత్రి' ఫార్ములా ఆధారంగా క్యాబినెట్ ప్రణాళిక నిర్ణయించినట్లు తెలిసింది.

వివరాలు 

 జేడీయూకి 14 స్థానాలు దక్కే అవకాశం 

మొత్తం మంత్రివర్గంలో బీజేపీకి 15 లేదా 16 పదవులు, జేడీయూకి 14 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)కు మూడు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాజ్యసభ సభ్యుడు ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు చెరో ఒక మంత్రి పదవి కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.