Bihar: రేపే నితీష్ రాజీనామా.. కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రస్థానం రేపటితో ముగియనుంది. రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రానికి నాయకత్వం వహించిన ఆయన అనూహ్యంగా గత నెలలో రాజ్యసభకు వెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఏప్రిల్ 14, మంగళవారం నాడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈసారి ముఖ్యమంత్రి పదవి జేడీయూకు కాకుండా బీజేపీకి దక్కనున్నది. దీంతో నితీష్ కుమార్ తర్వాత బీజేపీ నాయకుడే రాష్ట్రానికి నాయకత్వం వహించనున్నట్లు స్పష్టమైంది.
వివరాలు
నితీష్ కుమార్ వారసుడు ఎవరన్న విషయంపై ఉత్కంఠ
మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాట్నాలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే నితీష్ కుమార్ వారసుడు ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ' బీజేపీ ఉన్నత నాయకత్వం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన కాకపోతే కేంద్రంలో ఉన్న మరొక నాయకుడికి అవకాశం లభించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం
మొత్తానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన వెంటనే బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 202 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వెనుకబడ్డాయి. తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.