Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు
బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో ఆదివారం అర్థరాత్రి లొంగిపోయారు. సుప్రీంకోర్టు విధించిన గడువును అనుసరించి 11 మంది దోషులు లొంగిపోయారని క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.ఎల్ దేశాయ్ తెలిపారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రిమిషన్‌ను రద్దు చేస్తూ.. జనవరి 8న సుప్రీంకోర్టు రద్దు చేసింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. అయితే దోషులకు లొంగిపోయేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు తిరస్కరించి ఆదివారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది.
బిల్కిస్ బానోపై 11మంది సామూహిక అత్యాచారం
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో గోద్రా రైలు దహనం తర్వాత ఆ రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో బిల్కిస్ బానో వయస్సు 21సంవత్సరాలు. ఆమె అప్పుడు ఐదు నెలల గర్భవతి. అయితే అల్లర్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అల్లర్లలో భాగంగా ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా తన కుటుంబంలోని ఏడుగురు ఊతకోతకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన కేసులో 11మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో నిందితులను విడుదల చేశారు. ఆ తర్వాత బిల్కిస్ బానో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో నిందితులు మళ్లీలో జైలులో లొంగిపోయారు.