Amaravati: క్యాన్సర్ కట్టడికి 'బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్'.. ముందుగానే ముప్పు గుర్తించేలా చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బాధితుల్లో 70 శాతం మంది 40-69 ఏళ్ల మధ్య వయసువారే ఉంటున్నారు. 2020-25 మధ్య దేశవ్యాప్తంగా క్యాన్సర్ కొత్త కేసుల పెరుగుదల 12.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో ఏకంగా 39.5 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4.73 లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు కచ్చితమైన వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే.. ముందుగానే క్యాన్సర్ ముప్పును అంచనా వేసి, బాధితులకు కచ్చితమైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల 'బయోఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్'ను ఏర్పాటు చేసింది.
వివరాలు
క్యాన్సర్ కట్టడికి ఈ ప్రణాళికలు
అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి క్యాన్సర్ కట్టడికి ఈ టాస్క్‌ఫోర్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
డిజిటల్ హిస్టోపాథాలజీ, ఎలక్ట్రానిక్ రికార్డుల అనుసంధానంతో బయాప్సీ నమూనాలను దీర్ఘకాలం భద్రపరిచేలా రాష్ట్రస్థాయి బయోబ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు.
క్యాన్సర్ వైద్య పరిశోధనల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్-ఇంటిగ్రేటివ్ బయాలజీ (సీఎస్‌ఐఆర్-ఐజీఐబీ), సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నైపుణ్యాన్ని వినియోగించుకోనున్నారు.
వివరాలు
వైద్య సేవల విస్తరణకు రోడ్‌మ్యాప్
క్యాన్సర్ కేసులను నియంత్రించడంతోపాటు వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, బాధితులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వైద్య, మౌలిక వసతుల విస్తరణకు రోడ్‌మ్యాప్ రూపొందించింది.
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం, ఇందుకోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే వైద్య సేవలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి దశలో గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, కడపలో నాలుగు సమగ్ర క్యాన్సర్ కేంద్రాలు (సీసీసీ) ఏర్పాటు చేసింది.
అదనంగా 17 ఆంకాలజీ యూనిట్లు, 23 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ డేకేర్ కీమోథెరపీ కేంద్రాలు (డీసీసీసీ) ఏర్పాటు చేసింది.
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆంకాలజీ విభాగానికి నిధుల కేటాయింపును పెంచి, ఏటా రూ.746 కోట్లు ఖర్చు చేస్తోంది.
వివరాలు
మహిళల్లోనే ఎక్కువగా కేసులు
క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా 3.45 లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు కూడా అందించింది.
రాష్ట్రంలో ఏటా 76 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు వెలుగులోకి వస్తుండగా.. 40 వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
మొత్తం క్యాన్సర్ బాధితుల్లో మహిళల వాటా 59-61 శాతంగా ఉంది. మహిళల్లో ప్రధానంగా రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి.
పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీటి పెరుగుదల 1.7 రెట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
వివరాలు
స్క్రీనింగ్ తర్వాత పరీక్షలకు వెనకడుగు
క్యాన్సర్ స్క్రీనింగ్‌లో అనుమానితులుగా గుర్తిస్తున్న వారిలో 88.2 శాతం మంది వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు.
ఫలితంగా చాలామంది వ్యాధి ముదిరిన తర్వాత, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఆలస్యంగా చికిత్స పొందడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, నిర్ధారణ పరీక్షలకు ప్రజలను ప్రోత్సహించడం, అత్యాధునిక సాంకేతికతతో కచ్చితమైన వైద్యం అందించడం, రాష్ట్రంలోనే మెరుగైన చికిత్సా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.