Loading...
BJP New Team: భాజపా జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. పురందేశ్వరికి కీలక పదవి
భాజపా జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. పురందేశ్వరికి కీలక పదవి

BJP New Team: భాజపా జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. పురందేశ్వరికి కీలక పదవి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో పాటు వివిధ కీలక సంస్థాగత పదవులకు ఎంపికైన నేతల జాబితాను పార్టీ వెల్లడించింది. ఈ నియామకాలతో పార్టీ జాతీయ స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టింది. కొత్తగా నియమితులైన నేతలు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో పనిచేయనున్నారు.

వివరాలు  

జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది

భాజపా జాతీయ ఉపాధ్యక్షులుగా కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాలకు అవకాశం దక్కింది.

వీరితో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన తీరథ్‌ సింగ్‌ రావత్‌, దిల్లీకి చెందిన రామ్‌ మాధవ్‌, ఒడిశాకు చెందిన బైజయంత్‌ జయ్‌ పాండా, రేఖా వర్మ, గుజరాత్‌కు చెందిన వర్షాబెన్‌ నరేంద్రభాయ్‌ దోషీ, మహారాష్ట్రకు చెందిన డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌, పంజాబ్‌కు చెందిన సర్దార్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్‌ సింగ్‌ ఆర్య, కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్‌ ఎం. నాగరాజా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్‌ తారిఖ్‌ మన్సూర్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన డాక్టర్‌ మధుచంద్ర కర్‌ నియమితులయ్యారు.

వివరాలు 

స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ భాజపాలో కీలక సంస్థాగత బాధ్యతల్లోకి తిరిగి వచ్చారు.

ఆమెను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమించింది. తాజా నియామకంతో స్మృతి ఇరానీ మరోసారి భాజపా జాతీయస్థాయి సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వీరు

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌, విప్లవ్‌ కుమార్‌ దేవ్‌, స్మృతి ఇరానీ, డాక్టర్‌ సతీశ్‌ పునియా, గజేంద్ర పటేల్‌, హరీశ్‌ ద్వివేదీ, సంజయ్‌ భాటియాలను నియమించింది.

ADVERTISEMENT

వివరాలు 

జాతీయ కార్యదర్శుల జాబితా

జాతీయ కార్యదర్శులుగా కవిత పాటీదార్‌, కె. సురేంద్రన్‌, డాక్టర్‌ భోలాసింగ్‌, డాక్టర్‌ ప్రదీప్‌ వర్మ, జగదీశ్‌ ఈశ్వరభాయ్‌ పటేల్‌, డాక్టర్‌ సందీప్‌ పాఠక్‌, ఫాంగ్నోన్‌ కొన్యక్‌, సంగీతా యాదవ్‌, అనిల్‌ ఆంటోనీ, ఎం. వెంకటేషన్‌, మనోజ్‌ తిగ్గా, సిద్ధార్థ్‌ శంబు, స్వదేశ్‌ సింగ్‌, మృగాంక్‌ దేవ్‌ బర్మన్‌, రోహన్‌ గుప్తా, జై ప్రకాశ్‌లకు అవకాశం కల్పించింది.

కోశాధికారుల నియామకం

భాజపా జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను నియమించింది. సంయుక్త కోశాధికారి పదవికి రాజేశ్‌ మంగల్‌ను ఎంపిక చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

ఇదిలా ఉండగా, త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ ఆఠవాలే వెల్లడించారు.

భాజపాతో పాటు మిత్రపక్షమైన ఎన్‌సీపీకి చెందిన కొత్త నేతలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

తాజాగా భాజపాలో సంస్థాగత మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చనే సమాచారం వినిపిస్తోంది.

తెలంగాణకు దక్కని ప్రాతినిధ్యం

భాజపా తాజాగా ప్రకటించిన జాతీయస్థాయి పదవుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.

జాతీయ కార్యవర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యం కల్పించినప్పటికీ.. తెలంగాణకు మాత్రం ఎలాంటి పదవి లభించలేదు.

ADVERTISEMENT