
పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు.
తెలంగాణలో జనసేనతో పొత్తు అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఇది వరకే ప్రకటించారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ జనసేన పోటీ చేయాలనుకుంటే, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా? బీజేపీతో కలిసి బరిలో నిలబడుతుందా? అనేది తేలాల్సి ఉంది.
తెలంగాణలో గెలిచి అవకాశాలు లేకపోయినా, కేడర్‌లో నమ్మకాన్ని పెంచేందుకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని జనసేన చాలా రోజులుగా ఆలోచిస్తోంది.
జనసేన
తెలంగాణలో 30స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న జనసేన
బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా పవన్ తన అభిప్రాయాలను చెప్పినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.
2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసినట్లు గుర్తు చేసారు.
బీజేపీ నేతల సూచన మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకున్నట్లు బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తామ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30స్థానాల్లో అయినా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు పవన్ వివరించారు.
పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ నేతలు తనతో చెబుతున్నట్లు పవన్ వెల్లడించారు.
రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తామని బీజేపీ నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పారు.