Bihar Speaker: బీహార్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు స్పీకర్ పదవిపై బీజేపీ,జేడీయూ కన్ను!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎవరివద్ద ఏ మంత్రిత్వ శాఖ ఉండాలి అనే విషయంపై ప్రధాన పార్టీలు,మిత్రపక్షాలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నాయి. ఈనేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ బాధ్యత ఎవరికీ దక్కాలి అన్న విషయంలో జేడీయూ,బీజేపీ రెండూ తమ ఆప్షన్‌ను వదిలిపెట్టేలా లేవని అక్కడి మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి. అసెంబ్లీస్పీకర్ పదవి ఇప్పుడు రెండు పార్టీల మధ్య పెద్ద ఘర్షణకేంద్రమైంది. మంగళవారం ఢిల్లీలో నితీశ్ కుమార్ బీజేపీ టాప్ లీడర్లతో నేరుగా మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఈభేటీలో మంత్రుల శాఖల కేటాయింపు కంటే కూడా స్పీకర్ పోస్టే ప్రధాన చర్చాఅంశమని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఆ స్థానాన్ని తాము వదులుకునే ప్రసక్తే లేదని భావిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
స్పీకర్ పదవి విషయంలో ఇరు పార్టీల మధ్య పోటీ
ఇప్పటికే గతంలో కూడా స్పీకర్ పదవి విషయంలో ఇరు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆ సమయంలో జేడీయూకి ముఖ్యమంత్రి పదవి దక్కడం, బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం వంటివి నేపథ్యంలో బీజేపీదే ఆ పదవి అయ్యింది. అప్పటి ప్రభుత్వంలో బీజేపీకి చెందిన నంద కిషోర్ యాదవ్ స్పీకర్‌గా పనిచేయగా, జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అయితే ఈసారి తమకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని జేడీయూ పట్టుబడుతోంది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినందున ఆ పార్టీ ఈ డిమాండ్‌పై ముందుకి రాబోయేలా కనిపించడం లేదు.
వివరాలు
ఈరోజు ఢిల్లీకి సంజయ్ కుమార్ ఝా,లలన్ సింగ్‌లు
ఈ నేపథ్యంలో బిహార్ బీజేపీ ముఖ్య నాయకులు పట్నా కార్యాలయంలో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. స్పీకర్ పదవితో పాటు ప్రముఖ శాఖలను కూడా ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కేంద్రాధికారులకు తెలియజేయాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. ఇక జేడీయూ వైపు నుంచి సంజయ్ కుమార్ ఝా, లలన్ సింగ్‌లు ఈరోజు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. నితీశ్‌తో కలిసి బీజేపీ నేతలతో జరగబోయే కీలక సమావేశంలో హాజరై స్పీకర్ పోస్టును జేడీయూకే ఇవ్వాలని ఒత్తిడి చేయాలని ఆ నేతలు భావిస్తున్నారు. మరోవైపు మంత్రి వర్గం తుది కూర్పు బాధ్యతను బీజేపీ హైకమాండ్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అప్పగించింది.
వివరాలు
ఎన్‌డీయే సమావేశంలో శాసనసభా పక్ష నేతను అధికారికంగా ప్రకటించనున్నారు
ఆయన కూడా ఇవాళ పట్నాకు చేరి ఎన్డీయే మిత్రపక్షాలు.. లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహ—తో చర్చలు జరపనున్నారు. ఈ మూడు మిత్రపక్షాలు ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇప్పటికే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. రేపు (నవంబర్ 19) జేడీయూ, బీజేపీలు వేర్వేరు లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి. అనంతరం ఎన్‌డీయే సమావేశంలో తమ శాసనసభా పక్ష నేతను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎల్లుండి పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం అధికారికంగా ఏర్పడనుంది.