Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్
డీఎంకే అధినేత,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. 'సనాతన ధర్మం'పై ఇటీవల ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, దానిని అనుసరించే 80 శాతం మంది జనాభా "జాతి నిర్మూలన"కు పిలుపునిచ్చిందని మాల్వియా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు మేరకు తమిళనాడులోని తిరుచ్చిలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 153, 153 (A), 504, 505 (1) (b) సెక్షన్ల కింద మాల్వియాపై కేసు నమోదు చేశారు.
ఉదయనిధిని విమర్శించిన హిందుత్వ గ్రూపులు,బీజేపీ,ఇతర రాజకీయ పార్టీలు
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ,రాజకీయ ఉద్దేశ్యంతో,రెండు వర్గాల మధ్య హింస,ద్వేషాన్ని రెచ్చగొట్టడం,మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మంత్రి చేసిన ప్రసంగాన్ని అమిత్ మాలవ్య ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'సనాతన ధర్మం'పై ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించింది. దీని తర్వాత అనేక హిందుత్వ గ్రూపులు, బిజెపితో సహా రాజకీయ పార్టీలు డీఎంకే నాయకుడిని విమర్శించాయి. సెప్టెంబరు 3న జరిగిన సదస్సులో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని అన్నారు.
అట్టడుగు వర్గాల తరపున నేను మాట్లాడాను: ఉదయనిధి
మాల్వియా ట్వీట్ తర్వాత, సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు తాను కట్టుబడిఉన్నానని ,అంతేకాకుండా ఎలాంటి న్యాయపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని ఉదయనిధి చెప్పారు. 'సనాతన ధర్మం' వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడినట్లు ఆయన తెలిపారు.