Amit Shah: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్‌కు అమిత్ షా, అసోంకు జేపీ నద్దా పరిశీలకులుగా నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిశీలకుడిగా అమిత్ షాను నియమించగా, సహ పరిశీలకుడిగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీను ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా బెంగాల్‌లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించేందుకు అమిత్ షా, మోహన్ చరణ్ మాఝీ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, అగ్రనేతల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బెంగాల్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతను ఎన్నుకోనున్నారు.
వివరాలు
బెంగాల్ లో ఈనెల 9న కొత్త ప్రభుత్వం
తద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికతో పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వీరిద్దరూ పర్యవేక్షిస్తారు. బెంగాల్‌లో ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 సీట్లు గెలుచుకుంది. ఇదే సమయంలో అసోంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అక్కడ కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నియమించింది. సహ పరిశీలకుడిగా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని వ్యవహరిస్తారు. అసోంలో బీజేపీ కూటమి 82 సీట్లు సాధించింది.
వివరాలు
సీఎం ఎంపికపై పెరిగిన ఆసక్తి
ఈ నేపథ్యంలో లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపిక, ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను నడ్డా, నయాబ్ సింగ్ సైని పర్యవేక్షించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి అధికారంలోకి రానుండటంతో సీఎం అభ్యర్థి ఎంపికపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు అసోంలో ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ అదే పదవిలో కొనసాగనున్నారు.