రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో మరో ఉగ్ర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే రాజౌరిలో మరో పేలుడు సంభవించడంతో కశ్మీర్ లోయలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రాజౌరిలో సోమవారం జరిగిన దాడిని జమ్మ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ ధృవీకరించారు. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా. మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
రూ. 10లక్షల పరిహారం
రాజౌరిలో కాల్పుల ఘటనను జమ్ముకశ్మీర్ ఎల్‌జీ మనోజ్ సిన్హా ఘటనను ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్షను పరిహారంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఎల్‌జీ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా.. స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాపని డిమాండ్ చేస్తున్నారు.