Bomb Threat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా విమానాలకు బాంబు బెదిరింపులు
విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరు రోజుల్లో 20కి పైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానానికి (Vistara Flight) బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అదే సంస్థకు చెందిన మరో విస్తారా విమానానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి లండన్‌కి వెళ్తున్న విస్తారా UK 17 విమానానికి సోషల్ మీడియా ద్వారా సెక్యూరిటీ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారం వెంటనే విమాన సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ కారణంగా పైలట్లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయానికి మళ్లించారు, అక్కడ భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానానికి బెదిరింపులు
సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత విమానం తిరిగి గమ్యస్థానానికి ప్రయాణిస్తుందని విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రస్తుతం ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని కంపెనీ ప్రకటించింది. ఈ నెల 17న ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానానికి కూడా 147 మంది ప్రయాణికులతో బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించామని విస్తారా ప్రతినిధి చెప్పారు. భద్రతా దృష్ట్యా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయగా, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి భద్రతా తనిఖీలు నిర్వహించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 196కి బాంబు బెదిరింపు
మరో ఘటనలో జైపూర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం రాత్రి, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 196 లో బాంబు ఉందంటూ అర్ధరాత్రి 12:45 గంటలకు ఇమెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఈ నేపథ్యంలో, దుబాయ్ నుంచి జైపూర్ వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దుబాయ్ నుంచి జైపూర్‌కు అర్ధరాత్రి 12:45 గంటలకు వస్తున్న అంతర్జాతీయ విమానానికి వచ్చిన బాంబు బెదిరింపు కారణంగా, విమానాశ్రయంలో భద్రతా చర్యలను పటిష్టం చేశారు. ఈ విమానం దుబాయ్ నుంచి అర్ధరాత్రి 1:20 గంటలకు జైపూర్ చేరుకుంది. అత్యవసర పరిస్థితుల్లో దాని ల్యాండింగ్ జరిగింది. విమాన ప్రయాణంలో మొత్తం 189 మంది ప్రయాణికులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా అనేక విమానాలకు బాంబు బెదిరింపులు
ల్యాండ్ అయిన తర్వాత భద్రతా బలగాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, దర్యాప్తులో విమానంలో ఏ అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా జైపూర్ విమానాశ్రయానికి వచ్చే విమానాల్లో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. జైపూర్‌కు అనుసంధానిత రెండు విమానాలు సహా దేశవ్యాప్తంగా అనేక విమానాలకు బాంబు బెదిరింపులు అందాయి. విమానంలో బాంబు పెట్టినట్లు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.