
Delhi: దిల్లీలో 20 స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర ఆగకుండా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈమెయిల్ ద్వారా వచ్చే బెదిరింపులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. తాజాగా 20కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో నగరవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ నిర్వీర్య బృందాలు రంగంలోకి దిగి, సంబంధిత పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించాయి. శుక్రవారం నాడు ఢిల్లీ నగరంలోని అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం వల్ల దేశ రాజధాని అంతటా భయాందోళనలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు, భారీ బలగాలను మోహరించి, విద్యార్థులను తక్షణమే పాఠశాలల నుంచి బయటకు తరలించారు.
వివరాలు
ఢిల్లీలో 20కి మించి స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు
అనంతరం పాఠశాలల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి గట్టి తనిఖీలు చేపట్టారు. ఈ వారంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది నాల్గవసారి కావడం గమనార్హం. వరుసగా వస్తున్న ఈ బాంబ్ బెదిరింపులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర భయం, ఆందోళనలు నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం..తాజా ఘటనలో 20కి మించి పాఠశాలలు లక్ష్యంగా బాంబు బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు.
వివరాలు
పాఠశాలల దగ్గరకు చేరుకుని తనిఖీలు చేపట్టిన పోలీసులు
ద్వారకాలోని సెయింట్ థామస్ స్కూల్, జిడి గోయెంకా స్కూల్, ద్వారక ఇంటర్నేషనల్ స్కూల్, గురునానక్ పబ్లిక్ సావరిన్ స్కూల్, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్‌లో ఉన్న రిచ్‌మండ్ స్కూల్ వంటి ప్రముఖ పాఠశాలలకు ఈ బెదిరింపులు అందాయని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాంబ్ నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆయా పాఠశాలలకు చేరుకుని తక్షణమే గట్టి తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.