Rajasthan borewell accident: బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లా కిరాట్‌పుర గ్రామంలో మూడేళ్ల చేతన ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయిన ఘటన దేశ ప్రజలను విషాదంలో ముంచింది.
డిసెంబరు 23న తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన చిన్నారి, ఆడుకుంటున్న సమయంలో బోరుబావిలో 170 అడుగుల లోతులో చిక్కుకుపోయింది.
ఈ సంఘటన గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అధికారులను సంప్రదించగా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు.
తొలుత హుకప్ టెక్నిక్ ద్వారా బాలికను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించగా, అది ఫలించలేదు. దాంతో బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడం ప్రారంభించారు.
ఈ ప్రయత్నంలో ర్యాట్‌హోల్ మైనర్లు, పాలింగ్ మిషన్ సహాయంతో 170 అడుగుల సొరంగం తవ్వారు.
చేతనకు చేరుకునే మార్గంలో పెద్ద బండరాయి అడ్డుగా రావడంతో రక్షణ చర్యలు నెమ్మదించాయి.
Details
పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతున్న సిబ్బంది
సిబ్బంది రాయిని ముక్కలు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి రాయిని తొలగించి బాలిక వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎనిమిది రోజులుగా చేతన బోరుబావిలోనే మృత్యువుతో పోరాడుతోంది. పైపుల ద్వారా ఆక్సిజన్ పంపిస్తుండగా, కెమెరాల ద్వారా ఆమె కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి.
బోరుబావి ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లో గుణ జిల్లాలో 140 అడుగుల లోతున్న బోరుబావిలో పదేళ్ల బాలుడు పడిపోయాడు.
16 గంటలపాటు శ్రమించి రెస్క్యూ టీం అతడిని బయటకు తీసుకురాగలిగింది. అయితే ఆసుపత్రికి తరలించినప్పటికీ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.