కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు
కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న లాయర్ సలీం సంచలన ఆరోపణలు చేశారు. కోడికత్తి దాడిలో కీలక సూత్రధారి మజ్జి శ్రీనివాసరావు అని ఆయన అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణకు మజ్జి శ్రీనివాసరావు మేనల్లుడు కావడం గమనార్హం. ఆరోజు కోడికత్తిని దినేష్ కుమార్‌కు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఇచ్చినట్లు సలీం పేర్కొన్నారు. అయితే ఈ మొత్తం నేరాన్ని శ్రీనుపై మోపినట్లు చెప్పకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరైతే అన్ని నిజాలు బయటకు వస్తాయని సలీం అన్నారు. కావాలనే సీఎం జగన్ కోర్టుకు హాజరుకావడం లేదని తాను అనుకున్నట్లు చెప్పారు. రాజకీయాల కోసమే కోడికత్తి కేసును ఇంకా కొనసాగిస్తున్నట్లు అనిపిస్తోందని సలీం వివరించారు.
విజయవాడ నుంచి విశాఖకు కేసు బలిదీ
సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. అయితే ఈ కేసును ఇన్నేళ్లు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారించారు. ఎన్‌ఐఏ కూడా ఈ దాడిలో ఉగ్రకోణం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ కేసును విశాఖపట్నం మూడో అదనపు న్యాయస్థానానికి బదిలీ చేసారు. మంగళవారం తొలిసారిగా ఈ కేసుపై విచారణ జరిగింది. వాదనల జరిగిన అనంతరం విచారణ సెప్టెంబరు 6కు వాయిదా వేశారు. ఆ తర్వాత న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉంటే, నిందితుడుగా ఉన్న శ్రీను బెయిల్ పిటిషన్‌పై కూడా అదేరోజు విచారణ జరిగే అవకాశం ఉందని సలీం చెప్పారు.