Andhra Pradesh: ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025 అమలు అవసరం ఉన్నందున ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టే అవకాశం లేదని సమాచారం. అదే సమయంలో పదోన్నతుల అంశంపైనా స్పష్టత లేకుండా ఉంది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు ప్రారంభమైన తర్వాత ఏదో ఒక తేదీని కటాఫ్‌గా నిర్ణయించి, ఆ తేదీ వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా మొదట ఉపాధ్యాయుల పని సర్దుబాటు నిర్వహించే అవకాశం ఉంది. బోధనలో అంతరాయం లేకుండా ఉండేందుకు ముందుగానే ఈ సర్దుబాటు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇది విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే నిర్వహించనున్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకుని ఉపాధ్యాయుల కేటాయింపు చేయనున్నారు.
వివరాలు
ఉపాధ్యాయ పోస్టులన్నీ జిల్లా క్యాడర్‌గానే
దీనిపై తుది నిర్ణయం కమిషనరేట్ తీసుకోవాల్సి ఉంది. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఎంతమంది ఉపాధ్యాయులను కేటాయించాలనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025 అమల్లో భాగంగా అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులను జిల్లా క్యాడర్‌గానే పరిగణించనున్నారు. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లతో పాటు పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లోని ప్రధానోపాధ్యాయ గ్రేడ్-2 పోస్టులను కూడా జిల్లా స్థాయి పోస్టులుగానే పరిగణిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ గ్రేడ్-2 పోస్టును మాత్రం జోనల్ పోస్టుగా పరిగణించనున్నారు. అలాగే టీజీటీ, పీజీటీ పోస్టులు జోనల్ స్థాయి పోస్టులుగా ఉండగా, ప్రిన్సిపల్ పోస్టును మల్టీ జోన్ పోస్టుగా పరిగణిస్తారు.
వివరాలు
సీనియారిటీ ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ
ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమల్లో లేకపోవడంతో స్థానిక సంస్థల హెచ్ గ్రేడ్-2 పోస్టును కూడా జిల్లా పోస్టుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియామకాలు పొందినవారే. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో వారిని ఆయా జిల్లాల మధ్య సర్దుబాటు చేయనున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, స్థానిక సంస్థల ప్రధానోపాధ్యాయులను జిల్లా స్థాయి క్యాడర్‌లోనే సర్దుబాటు చేస్తారు. పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు కూడా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన టెట్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించగా, కొందరు అర్హత సాధించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఉపాధ్యాయ సంఘాలు మరియు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
వివరాలు
అత్యున్నత న్యాయస్థానం నుంచి స్పష్టత రాావాలి
దీనిపై అత్యున్నత న్యాయస్థానం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే పదోన్నతుల్లో టెట్ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాల సర్దుబాటులో సీనియారిటీ ఆధారంగా ముందుగా ఐచ్ఛికాలు తీసుకుని, జిల్లాల అవసరాల మేరకు కేటాయింపులు జరుపుతారు. జోనల్ పోస్టులుగా ఉన్న టీజీటీ, పీజీటీలను జోనల్ స్థాయిలోనే సర్దుబాటు చేస్తారు. ఐచ్ఛికాల ఆధారంగా అవసరాన్ని బట్టి మార్పులు జరుగుతాయి. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ ప్రకారం సర్దుబాటు పూర్తయిన తర్వాత సంబంధిత జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆ జిల్లాకు స్థానికులుగానే పరిగణిస్తారు. జోన్ స్థాయిలో కూడా ఇదే విధానం అమలులో ఉంటుంది.