Peddi Sudarshan Reddy: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
భారాస సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఉన్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కార్డియాక్ అరెస్ట్‌గా గుర్తించారు ఆసుపత్రిలో వైద్య బృందం సుమారు గంటపాటు తీవ్రంగా శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ నిర్వహించింది. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిలో స్వల్ప మెరుగుదల కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక చికిత్స అందించారు.
వివరాలు
ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్ల..
అయితే సుదీర్ఘకాలం ఆయనకు స్పృహ రాకపోవడంతో నాడీ వ్యవస్థ స్పందన కనిపించలేదని వైద్యులు తెలిపారు.
ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్ల మెదడుకు తీవ్ర నష్టం జరిగినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్‌ఐ, టీసీడీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొన్నారు.
గత ఐదు రోజులుగా చికిత్స కొనసాగినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
వివరాలు
సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయ నాయకుడిగా...
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రంలో రైతుకుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.
తెలంగాణ రాష్ట్రఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
మొదట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుదర్శన్‌రెడ్డి 2001లో తెరాసలో చేరారు.
అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు.
అనంతరం తెరాస ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు.
తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజాసేవ వరకు ఆయన చేసిన సేవలు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి.