Page Loader
BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు
BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు

BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు

వ్రాసిన వారు Stalin
Jan 11, 2024
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత గులాబీ శ్రేణులకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాల్లో పార్టీ పేరును మార్చడం కూడా ఒకటిగా శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వస్తున్న ఆయా జిల్లాల పార్టీ నాయకులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సమావేశం బుధవారం జరగ్గా.. అందులోనూ సీనియర్ నేత కడియం శ్రీహరి ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం.

టీఆర్ఎస్

పార్టీ పేరులో 'తెలంగాణ' లేకపోవడంతో..

రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ పార్టీగా టీఆర్ఎస్ బలమైన ముద్రను వేసుకుందని కడియం శ్రీహరి గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆయుపట్టువైన 'తెలంగాణ'ను తొలగించడం వల్ల సెంటిమెంట్ ప్రభావం తగ్గిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడంతో ఇది తమది కాదు అనే భావన కొంతమంది ప్రజల్లో వచ్చినట్లు కడియం శ్రీహరి.. కేటీఆర్‌తో అన్నారట. నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనూ కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కడియం వెల్లడించారట. మరీ.. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మారుస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.