రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ అన్నారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు తెలంగాణ గడ్డకు బాగా తెలుసన్నారు.ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని తీవ్రంగా విమర్శించారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుందని, గ్యారెంటీ అని, మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంట్ గతవుతుందని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అన్నారు. దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోతుందని, బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా, ధీమా గల్లంతవుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోతాయని, భూముల ధరలు పడిపోతాయన్నారు.