విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే క్యాడర్ కు కీలక దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలను, విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. కేవలం పార్టీ గెలుపు కోసమే పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో పలు రాష్ట్రాల PCCలు, CLPలు హాజరైన సదస్సులో ఖర్గే మాట్లాడారు. పార్టీలో సంస్థాగత పరంగా ఐక్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్రమశిక్షణ ద్వారానే అవతల వైపునున్న పార్టీలను ఓడించగలమని ధైర్యం నూరిపోశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కోసమే భారత ప్రజలు చూస్తున్నట్లు వివరించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలే క్రమశిక్షణ, ఐక్యతకు నిజమైన రుజువులని కొనియాడారు.
బీజేపీని ఓడించడమే మహాత్ముడికి అసలైన నివాళి
గత 10 ఏళ్లుగా సాగుతున్న బీజేపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఖర్గే అన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ విఫలమయ్యారని, ఇందుకు ఆత్మవిమర్శ చేసుకోవట్లేదన్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి 100 ఏళ్లు పూర్తి కానుందన్న ఖర్గే, బీజేపీని గద్దె దించడమే బాపుకి అసలైన నివాళన్నారు. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల సమయమే ఉందని, జమ్మూ-కశ్మీర్ ఎన్నికలకూ సిద్ధమవ్వాలని క్యాడర్ కు మార్గదర్శకం చేశారు. తెలంగాణలోనే కాకుండా, వచ్చే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని, బీజేపీ నుంచి ప్రజలకు విముక్తి రావాలన్నారు. ఈ దృఢ నిశ్చయంతోనే హైదరాబాద్ నుంచి బయల్దేరతామన్నారు.