Bullet train: విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ రైలు.. కొత్త కారిడార్‌కు ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలోని రెండు ప్రధాన నగరాలు అయిన విజయవాడ-విశాఖపట్టణం మధ్య బుల్లెట్ రైలు నడపడానికి హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే విజయవాడ-కర్నూలు మధ్య నేరుగా రైళ్లు నడిచే విధంగా,ప్రయాణ సమయం తగ్గించే లక్ష్యంతో సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనను కూడా సిద్ధం చేశారు. ఇవే కాకుండా మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేసే ప్రణాళికపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు.
వివరాలు
రాష్ట్రంలో నాలుగో బుల్లెట్ రైల్ కారిడార్ ప్రతిపాదన
బోర్డు నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టుల అమలుకు తదుపరి చర్యలు ప్రారంభమయ్యే అవకాశముంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలను కలుపుతూ మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మూడు కారిడార్లు ఇప్పటికే ప్రతిపాదించారు. అవి అమరావతి మీదుగా వెళ్లే హైదరాబాద్-చెన్నై కారిడార్, కర్నూలు, అనంతపురం మార్గంగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు కారిడార్, చిత్తూరు మీదుగా వెళ్లే చెన్నై-బెంగళూరు కారిడార్. ఇప్పుడు వీటికి అదనంగా విజయవాడ-విశాఖపట్నం మధ్య మరో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాదాపు 350 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాల మీదుగా వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
వివరాలు
విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్
ఈ కారిడార్ అమలులోకి వస్తే గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు ఈ రెండు నగరాల మధ్య నడిచే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇది అమరావతి-విజయవాడ-విశాఖపట్నం మార్గంగా నిర్మిస్తే హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ కారిడార్‌కు కూడా అనుసంధానం కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా వెళ్లే రైళ్లు అందుబాటులో లేవు. ప్రయాణికులు డోన్ లేదా నంద్యాలలో దిగిపోయి అక్కడి నుంచి మరో రైలులో కర్నూలుకు చేరాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ రెండు నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. గుంటూరు,నరసరావుపేట,మార్కాపురం, కంభం,నంద్యాల ప్రాంతాల మీదుగా దాదాపు 350 కిలోమీటర్ల పొడవులో ఈ లైన్‌ను నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
వివరాలు
మాచర్ల-గద్వాల్ కొత్త రైల్వే లైన్
సెమీ హైస్పీడ్ కారిడార్‌లో రైళ్లు గరిష్ఠంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం రెండు గంటల్లో చేరుకునే వీలుంటుంది. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ వరకు దాదాపు 184 కిలోమీటర్ల పొడవులో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయాలకు సరుకు రవాణా సులభంగా జరిగేలా చేయడంలో ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషించనుంది.
వివరాలు
నెల్లూరు-రాజంపేట రైల్వే మార్గం
నెల్లూరు నుంచి రాజంపేట వరకు దాదాపు 120 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి రాజంపేట లేదా కడప వైపు రైలులో వెళ్లాలంటే రేణిగుంట, రైల్వేకోడూరు మార్గంగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి బదులుగా నేరుగా నెల్లూరు నుంచి రాజంపేటకు రైల్వే మార్గం ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. సామర్లకోట-చింతూరు రైల్వే లైన్ సామర్లకోట నుంచి చింతూరు వరకు సుమారు 150 కిలోమీటర్ల పొడవులో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా ప్రతిపాదనలు పంపించారు.
వివరాలు
కళ్యాణదుర్గం-అనంతపురం కొత్త లైన్
కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వరకు 58కిలోమీటర్ల పొడవులో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు రైల్వే లైన్ ఉంది.ఇప్పుడు కొత్త లైన్ నిర్మాణం జరిగితే రాయదుర్గం నుంచి అనంతపురం వరకు నేరుగా రైల్వే మార్గం అందుబాటులోకి వస్తుంది. గూడూరు-దుగరాజపట్నం పోర్టు రైల్వే లైన్ గూడూరు నుంచి దుగరాజపట్నం వద్ద ప్రతిపాదిత పోర్టుకు రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈప్రాజెక్టుకు 2016లోనే డీపీఆర్ సిద్ధం చేసినప్పటికీ అప్పట్లో ఆర్థికంగా లాభదాయకం కాదని భావించి పక్కనపెట్టారు. ఇప్పుడు దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు,షిప్‌బిల్డింగ్ యూనిట్ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో రైల్వే లైన్ అవసరాన్ని మళ్లీ పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని అధికారులు నిర్ణయించారు.
వివరాలు
శ్రీశైలం రైల్వే కనెక్టివిటీ
శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే మార్గం ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు సుమారు 290 కిలోమీటర్ల పొడవులో కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ప్రణాళిక ఉంది. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి అలాగే మార్కాపురం వైపు నుంచి శ్రీశైలం వరకు రైలు మార్గం ద్వారా సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.