Telangana: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈసారి విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్ల భారీ కేటాయింపులు చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా విస్తరించనున్నట్లు ప్రకటించారు.
Details
విద్యార్థుల సంక్షేమానికి ఇది కొత్త అధ్యాయం
పేద విద్యార్థుల్లో చదువు మానేసే వారి సంఖ్య తగ్గించడంలో ఇది కీలకంగా సహాయపడుతుందని భట్టి తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి ఇది కొత్త అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి నెలకు రూ.2,000 స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే మా లక్ష్యం. అంబేద్కర్ ఆశయాల మేరకు పాలన కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.