LOADING...
CM Chandrababu: ఏపీలో బంపర్ ఆఫర్.. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల నగదు బహుమతి
ఏపీలో బంపర్ ఆఫర్.. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల నగదు బహుమతి

CM Chandrababu: ఏపీలో బంపర్ ఆఫర్.. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల నగదు బహుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతున్న జనాభా వృద్ధిరేటుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గుదల భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్రమైన సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా యువ జనాభా తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఉత్పాదకత దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమని దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

వివరాలు

పిల్లలను కనే కుటుంబాలకు ఆర్థిక సాయం

మానవ వనరుల ప్రాధాన్యతను వివరిస్తూ.. పిల్లలు కుటుంబానికి లేదా దేశానికి భారం కాదని, వారే నిజమైన సంపద అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం విప్లవాత్మక ప్రోత్సాహకాలను తీసుకురానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే కీలక పథకాన్ని ప్రకటించారు. కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తామని, నాలుగో బిడ్డ పుట్టినప్పుడు రూ.40,000 నగదు ప్రోత్సాహకం ఇస్తామని వెల్లడించారు. జనాభా పెంపు విధానాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా సీఎం స్పందించారు.

వివరాలు

ఇది 'స్వర్ణాంధ్ర' సాధనకు దోహదపడుతుంది

రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇది 'స్వర్ణాంధ్ర' సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని, వారి పనితీరుపైనే ప్రభుత్వానికి మంచి లేదా చెడు పేరు ఆధారపడి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున పనిచేసే అధికార వ్యవస్థతో పాటు నిరంతరం కష్టపడే పార్టీ శ్రేణులే తనకు ఉన్న రెండు ప్రధాన బలాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement