LOADING...
<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Bus Fire: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!</span>
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!

Bus Fire: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి మరో 19 మంది మృతిచెందారు. ఆ ఘటనల దుఃఖం ఇంకా మాయం కాకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈసారి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపంలో *విహారి ట్రావెల్స్*‌కు చెందిన ఏసీ స్లీపర్ కోచ్ బస్సులో మంటలు చెలరేగాయి.

Details

సురక్షితంగా బయటికి దిగిన ప్రయాణికులు

హైదరాబాద్‌ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు వెళ్తున్న ఈ బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, కొద్ది నిమిషాల్లోనే మంటలు మొత్తం బస్సును చుట్టేసి దగ్ధమయ్యింది. ఈ బస్సు కూడా నాగాలాండ్‌లో రిజిస్టర్‌ అయి ఉందని పోలీసులు తెలిపారు. మంటల కారణం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Details

వరుసగా బస్సు ప్రమాదాలు

ఆ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఆ ప్రమాదం బైక్‌పై మద్యం మత్తులో ప్రయాణించిన శివశంకర్‌ కారణంగానే జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఆయన నడిపిన బైక్‌ను ఓమ్ని బస్సు రోడ్డుమధ్యకు లాగడంతో, వెంటనే వెనుకనుంచి వస్తున్న 'వి కావేరీ ట్రావెల్స్' బస్సు ఢీకొట్టి దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దాంతో బస్సులో మంటలు చెలరేగి, అందులో ప్రయాణిస్తున్న 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇలా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. రహదారుల భద్రత, ప్రైవేట్ ట్రావెల్స్‌ వాహనాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.