CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం.. సీఎస్ ఉత్తర్వులు జారీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం, ప్రతి నెలలో రెండు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా, నవంబర్ నెలలో మొదటి కేబినెట్ సమావేశాన్ని నవంబర్ 7న నిర్వహించనున్నట్లు తేలింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను నవంబర్ 5 సాయంత్రానికి పంపించాలని సీఎస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Details
సీఐఐ సదస్సుపై విస్తృత చర్చ
ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సుపై విస్తృత చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించగా, ఆ కమిటీ సూచనలను కూడా సమావేశంలో పరిశీలించనున్నారు. అదనంగా, రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులు వంటి అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే సమయంలో, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేయనున్నారని సమాచారం.