అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీబీఐ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ అవినాష్ చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెకేషన్ బెంచ్ ముందు అన్ని పక్షాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదని బెంచ్ పేర్కొంది. అలాగే ఎంపీ అరెస్టులో సీబీఐ జాప్యం చేస్తోందని అభిప్రాయపడింది.
ఇంకా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలోనే అవినాష్
ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించే వరకు అవినాష్‌ను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కానీ ధర్మానసం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే, సోమవారం కర్నూలులో అవినాష్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నించింది కానీ, స్థానిక పోలీసులు సహకరించకపోవడంతో అరెస్టు జరగలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అవినాష్ చుట్టూ కంచుకోటగా ఏర్పడి అతడిని అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. మరి ఇప్పుడు సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, అవినాష్ ఇంకా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్నారు.