Chandra Babu: అనర్హులకు పింఛన్లు రద్దు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక అనర్హుల పింఛన్ల తొలగింపునకు కసరత్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్లతో పింఛన్ పొందిన వివరాలు అందాయని, వారు స్వచ్ఛదంగా తమ పింఛన్లను వదులుకోవాలని చంద్రబాబు సూచించారు. పింఛన్లను అర్హులకు మాత్రమే అందించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేసి నిర్ధారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనర్హులు పింఛన్ పొందడం వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు.
కొత్త ఫించన్లపై విధివిధానాల రూపకల్పన
వృద్ధులకు పింఛన్లతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3వేల నుంచి రూ.6 వేలకు పెంచామన్నారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ.15వేలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. అనర్హుల తొలగింపునకు చర్యలు చేపడుతూ, పింఛన్ల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. కొత్త పింఛన్లపై విధివిధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో 'కేబినెట్ సబ్ కమిటీ'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు అందించే అంశంపై కసరత్తు జరుగుతుందని తెలిపారు.