Election Commission: పేపర్ కథనం ఆధారంగా సీఈసీపై ఆదేశాలివ్వలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
'సర్' అంశంపై ఎన్నికల కమిషన్ (Election Commission)లో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వార్తాపత్రికలో ప్రచురితమైన కథనం ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై నేరుగా ఉత్తర్వులు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఇతర ఎన్నికల కమిషనర్లకు రాజ్యాంగబద్ధంగా కేటాయించిన అధికారాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వినియోగించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అంతకంటే ముందుగా ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం ఇచ్చే వివరణను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
వివరాలు
ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఓట్ల తొలగింపునకు సంబంధించిన నిర్ణయాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నట్లు నిరూపితమైతే.. తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
ఈ అంశానికి సంబంధించి దాఖలైన ఇతర పిటిషన్లను కూడా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
2025 జూన్ నుంచి ఇప్పటివరకు 'సర్' ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలగించిన 13 కోట్లకు పైగా ఓట్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.
అలాగే సీఈసీ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు..
'సర్' ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపు, చేర్పులకు సంబంధించిన నిర్ణయాలపై గత 10 నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సంధూ, జోషి 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఇటీవల జాతీయ మీడియాలో ఒక కథనం వెలువడింది.
ఈ కథనం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి నేతలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
ఈ పరిణామాల మధ్యే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
వివరాలు
ఫారం 6లో మార్పులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఉపయోగించే ఫారం 6లో చేసిన మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
2025లో ఫారం 6లో ప్రవేశపెట్టిన అనుబంధ పత్రంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే సెప్టెంబర్ 28న ఎన్నికల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివాదంపై స్పందించింది.
ఫారం 6కు జత చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు సమర్థించినట్లు ఆ ప్రకటనలో ఈసీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.