Supreme Court: 'భార్యను పశువులా చూడొద్దు'.. గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
గృహహింస వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు భర్తల బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను పశువులా చూడకూడదని, ఆమెకు గౌరవంగా జీవించే హక్కు ఉందని స్పష్టం చేసింది. గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే కేసులో గతంలో పట్నా ఉన్నత న్యాయస్థానం కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బాధితురాలి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడికి పాల్పడ్డాడని కోర్టుకు తెలిపారు. ఆమెను నేలపైకి తోసేయడంతో ఇటుక తగిలి తలకు గాయమైనట్లు వివరించారు. అనంతరం కర్రతో కూడా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
వివరాలు
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
కేసు విచారణలో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, కోర్టును ఆశ్రయించిన మహిళ అతడి మొదటి భార్య అని న్యాయస్థానానికి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. "మీ భార్యను ఎందుకు కొట్టాలనుకున్నారు..? ఇలాగే వేధిస్తే ఆమె మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. ముందస్తు బెయిల్ కాకుండా సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి" అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.