Rajiv Ranjan Singh: ఎన్నికల ప్రచారంలో JDU లలన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఓటింగ్ రోజున పేద ప్రజలు తమ ఇళ్లనుంచి బయటకు రాకుండా తాళాలు వేయాలని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్)పై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మొకామా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లలన్ సింగ్ మాట్లాడుతూ, ఓటింగ్ జరిగే రోజున పేదవారు బయటకు రాకుండా వారి ఇళ్లకు తాళాలు వేసి, ఏ పరిస్థితుల్లోనూ వారు ఓటు వేయకుండా చూడాలని సూచించారు. ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశాయి.
వివరాలు
ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు
ఆర్జేడీ నాయకులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, లలన్ సింగ్ ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు ఓటర్లను బెదిరించేలా ఉన్నాయని పేర్కొంటూ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లను బెదిరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో లలన్ సింగ్ వ్యవహరించారని ఆరోపిస్తూ, ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.