Dhirendra Shastri: శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోర్టులో క్రిమినల్ పరువునష్టం కేసు నమోదైంది. కృష్ణుడిని ఆరాధించే కోట్లాది మంది భక్తులను అవమానించేలా ఆయన మాట్లాడారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అజయ్ ప్రతాప్ సింగ్ అనే న్యాయవాది ఆగ్రా సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నిర్వహించిన రామకథ కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి ప్రసంగిస్తూ శ్రీకృష్ణుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాలు
కృష్ణుడు నిలబడినప్పుడు మూడు వైపులకు వంగి ఉంటాడని వ్యాఖ్య
"శ్రీకృష్ణుడు మోసగాడు. ఆయన నిలబడినప్పుడు మూడు వైపులకు వంగి ఉంటాడు" అని ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు.
ఈ మాటలు కోట్లాది మంది కృష్ణ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని న్యాయవాది పేర్కొన్నారు.
అంతేకాకుండా శ్రీరాముడు,శ్రీకృష్ణుడి శారీరక భంగిమలను పోలుస్తూ కూడా ఆయన మాట్లాడినట్లు పిటిషన్‌లో వివరించారు.
ఇదే కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి మరో అంశాన్ని ప్రస్తావించారు.
ద్వాపరయుగంలో మానవ రూపంలో జన్మించిన శ్రీకృష్ణుడి వారసులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని చెప్పారు.
జాదూన్లు,జడేజాలు,భట్టీలు శ్రీకృష్ణుడి వంశానికి చెందినవారని పేర్కొన్నారు.
తన తండ్రి వైపు నుంచి తాను కూడా ఆ వంశానికి చెందినవాడినని వెల్లడించారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ జడ్జి కాంచన్ కుమార్ తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు.