CBSE : విడుదలైన సీబీఎస్‌ఈ ఇంటర్ ఫలితాలు.. దేశవ్యాప్తంగా 85 శాతం ఉత్తీర్ణత
ఈ వార్తాకథనం ఏంటి
సీబిఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను కేంద్ర మాధ్యమిక విద్యా మండలి బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in, cbseresults.nic.in, డిజీలాకర్, ఉమాంగ్ యాప్‌ల నుంచి తెలుసుకోవచ్చు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 18 లక్షలకు పైగా విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మొత్తం 85 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం మూడు శాతం తగ్గింది.
వివరాలు
ఫలితాల్లో బాలికలు మరోసారి ఆధిక్యం
ఫలితాల్లో బాలికలు మరోసారి ఆధిక్యం చాటారు. బాలికల్లో 88 శాతం మంది ఉత్తీర్ణులవగా, అబ్బాయిల్లో 82 శాతం మంది మాత్రమే పరీక్షల్లో విజయాన్ని నమోదు చేశారు. అలాగే 17 వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించగా, 94 వేల మంది 90 శాతానికి మించిన మార్కులు తెచ్చుకున్నారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా మే 13న సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేశారు.
వివరాలు
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
ఇప్పటివరకు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలను ఒకేసారి ప్రకటించే ఆనవాయితీ ఉండేది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించడంతో టెన్త్ ఫలితాలను ఇప్పటికే గత నెలలో ప్రకటించారు. తాజాగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 12వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించారు. 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' పద్ధతిని ఉపయోగించి మూల్యాంకనం చేపట్టగా, ఇందుకోసం ఉపాధ్యాయులకు ముందుగానే ప్రత్యేక శిక్షణ కూడా అందించారు.