CBSE Board Exams Postponed :పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వివిధ కారణాల వల్ల పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్న బోర్డు, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీల్లో కొన్ని పరీక్షా కేంద్రాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో పాటు 26 దేశాల్లో సీబీఎస్ఈ 10, 12 తరగతుల వార్షిక బోర్డు పరీక్షలను నిర్వహిస్తోంది. ఈసారి సుమారు 46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడి పరీక్షా ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది.
వివరాలు
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన 10వ, 12వ తరగతుల పరీక్షలను అనేక గల్ఫ్ దేశాల్లో వాయిదా వేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మార్చి 3న ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దాడుల అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాలు
ఈ దేశాల్లోని విద్యార్థులకు పరీక్షల వాయిదా
పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మార్చి 3న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోని విద్యార్థులకు పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను తరువాత ప్రకటిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అలాగే మార్చి 7 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయా లేదా అన్న అంశంపై మార్చి 5న మళ్లీ పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ తెలిపింది.
వివరాలు
కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్న బోర్డు
ఇదిలా ఉండగా,అంతకుముందు కూడా మార్చి 2,2026న జరగాల్సిన 10వ,12వ తరగతుల పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. ఆ పరీక్షల కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మార్చి 3న పరిస్థితిని మరోసారి అంచనా వేస్తామని అప్పట్లో వెల్లడించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ వాయిదా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్‌లోని పలు లక్ష్యాలపై వరుసగా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపాయి. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేపట్టింది. అదేవిధంగా పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.