Oil and Gas Companies: ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చమురు, గ్యాస్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతుల వివరాలను తప్పనిసరిగా పంచుకోవాలని సూచించింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, సహజ వాయువు సరఫరా గొలుసును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం కంపెనీలు తమ సమాచారాన్నిపెట్రోలియం ప్రణాళిక విశ్లేషణ సెల్ (PPAC)కు అందజేయాల్సి ఉంటుంది.
Details
విదేశాల్లోని భారతీయుల పరిస్థితిపై కేంద్రం కీలక సమాచారం
ఇక విదేశాల్లోని భారతీయుల పరిస్థితిపై కూడా కేంద్రం కీలక సమాచారం వెల్లడించింది. ఇరాన్‌లో ప్రస్తుతం దాదాపు వెయ్యి మంది భారతీయులు ఉన్నట్లు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న సుమారు 23 వేల మంది విద్యార్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE)పరీక్షలు రాయలేకపోయినట్లు పేర్కొంది. విద్యార్థుల ఫలితాల ప్రకటనపై త్వరలో స్పష్టత ఇస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. విద్యార్థుల ఫలితాలను యూనిట్ టెస్టులు, ప్రీ-బోర్డ్ పరీక్షలు, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటి అంతర్గత మార్కుల ఆధారంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా యుద్ధపరిస్థితుల మధ్య కూడా దేశీయ ఇంధన సరఫరా విదేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది.