LOADING...
Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి చేపల (ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం నిర్మాణానికి మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.47 కోట్ల నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెన్నైకి చెందిన కులు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయించి, ఇటీవలే టెండర్‌ల ప్రక్రియను ప్రారంభించింది.

వివరాలు 

అవసరం ఏమిటి? 

దేశవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాలు, ఆనకట్టల్లో చేపల ఉత్పత్తి గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతానికి 147.57 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి నమోదవుతోంది. ఈ మొత్తం ఉత్పత్తిలో 42 శాతం దేశీయ వినియోగానికి, కేవలం 6 శాతం మాత్రమే ఎగుమతులకు వినియోగమవుతోంది. మిగిలిన చేపలు వినియోగం లేకపోవడం వల్ల వృథా అవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చి, దేశవిదేశాల్లో ఎగుమతులను విస్తరించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కేంద్రం అవసరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారు? 

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి, మత్స్యసంవర్ధక విధానాలపై సమీక్ష జరపగా, ప్రధానమంత్రి మత్స్య కిసాన్‌ సమృద్ధి యోజన (PM-MKSSY) అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 5.73 లక్షల చదరపు కిలోమీటర్ల నీటి విస్తీర్ణంలో చేపల పెంపకం కొనసాగుతోంది. 2024 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం, మంచినీటి చేపల ఉత్పత్తి 4,39,513 టన్నులు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.122 కోట్ల వ్యయంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ అన్ని అంశాలు కేంద్ర ప్రణాళికలకు అనుగుణంగా ఉండటంతో, తెలంగాణలోనే అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం తేల్చింది.

వివరాలు 

ఎక్కడ నిర్మించబోతున్నారు? ఎప్పటిలో పూర్తి అవుతుంది? 

అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం కావడంతో విమానాశ్రయానికి సమీపంలోనే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకే రంగారెడ్డి జిల్లా కోహెడలో, శంషాబాద్‌ విమానాశ్రయం, జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న 13 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది విమాన రవాణాతోపాటు ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల ద్వారా సముద్ర మార్గంలో ఎగుమతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు 10 ఎకరాల భూమి సేకరణ పూర్తయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా టెండర్‌లు పిలిచారు. నవంబర్‌లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబరులో శంకుస్థాపన చేయాలని యోచిస్తున్నారు. ఒక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం.

వివరాలు 

ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? 

ఈ ఎగుమతుల కేంద్రం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మత్స్యకారులు, వ్యాపారులు నేరుగా లాభపడతారు. స్థానికంగా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదనంగా, ఇక్కడ ఏర్పడే భారీ హోల్‌సేల్‌ ఫిష్‌ మార్కెట్‌లో 2 వేల మందికి వ్యాపార అవకాశాలు ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల కారణంగా రొయ్యల ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో, ఈ కేంద్రం ద్వారా చేపలతోపాటు రొయ్యల ఎగుమతులను ఇతర దేశాలకు విస్తరించవచ్చని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్‌ తెలిపారు.