Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం
రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ పథకం ఎలాంటి చట్టాన్ని లేదా హక్కును ఉల్లంఘించదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రతిదాని గురించి తెలుసుకునే హక్కు ఉండదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (a) నిబంధన ఇదే విషయాన్ని చెబుతుందని ధర్మాసనానికి భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలియజేశారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో అటార్నీ జనరల్ ఈ వ్యాఖ్యలు చేసారు. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ పిటిషన్లపై విచారించనుంది.
ఎలక్టోరల్ బాండ్లను నియంత్రిస్తే.. విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లే: ఏజీ
ఎలక్టోరల్ బాండ్లను నియంత్రించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తే.. అది విధాన రూపకల్పనలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని ఏజీ వెంకటరమణి పేర్కొన్నారు. అభ్యర్థి నేరచరిత్రను తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని కోర్టులు ఇచ్చిన తీర్పును.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులకు ఆపాదించలేమని చెప్పారు. కేవలం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలను మాత్రమే వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఏదైనా వ్యక్తి లేదా సంస్థ ఏదైనా పార్టీకి రూ. 2,000లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే, అప్పుడు రాజకీయ పార్టీ దాత గురించిన సమాచారం ఇవ్వాలి. అయితే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ కింద రూ.కోటి విరాళం ఇచ్చినా.. దాత పేరు వెళ్లడించాల్సిన అవసరం లేకుండా నిబంధలను తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.