కేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు
జాతీయ ఆరోగ్య మిషన్ కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్ 4 చొప్పున ఫుడ్ స్ట్రీట్‌లను నెలకోల్పేందుకు ముందుకొచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ- గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఈ రెండు మంత్రిత్వ శాఖలు లేఖలు కూడా పంపాయి.
ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను తగ్గించేందుకు ఫుడ్ స్ట్రీట్‌లు దోహదం: కేంద్రం
సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ- గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించాయి. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫుడ్ స్ట్రీట్‌లు దోహదపడుతాయని కేంద్రం చెబుతోంది. ఇవి ఫుడ్ సేఫ్టీని ప్రోత్సహించడమే కాకుండా, స్థానిక ఆహార వ్యాపారాల పరిశుభ్రతను మెరుగుపరుస్తాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, కేంద్ర పట్టణ వ్యవహారాల కార్యదర్శి మనోజ్ జోషి అన్నారు.