కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు. దేశంలో మరో వేవ్ వచ్చినా.. తక్కువ ప్రభావాన్ని చూపేలా.. ఐఎంఏ సైతం కేంద్రానికి కీలక సూచనలు చేసింది. రెండో బూస్టర్ డోస్‌కు అనుమతి ఇవ్వాలని ఐఎంఏ కోరింది. మొదటి బూస్టర్ డోస్ తీసుకోని వారు.. వీలైనంత త్వరగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న'ఇన్ఫోడెమిక్'ను కట్టడి చేయాలని చెప్పింది.
రాష్ట్రాల స్థాయిలో కూడా చర్యలు
రాష్ట్రాలు కూడా కరోనా కట్టడికి తమ స్థాయిలో వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. సౌకర్యాలను పెంచాలని సూచించారు. వైద్యులు, నర్సులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఫీల్డ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వేడుకలను రాత్రి1 గంటకు ముగించాలని చెప్పింది. వేడుకల సమయంలో మాస్క్‌లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలను కేంద్రం వేగవంతం చేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది.