LOADING...
Bhavya scheme : నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Bhavya scheme : నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 19, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. రూ.33,600 కోట్ల వ్యయంతో "భారత ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య)" పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం భవ్య పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వచ్చే ఆరు సంవత్సరాలలో 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

వివరాలు

ప్రభుత్వ ఆర్థిక సాయం ఇలా..

భవ్య పథకం కింద 2026-27 నుంచి 2031-32 వరకు ఆరు సంవత్సరాల కాలంలో 100 నుండి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రీయల్ పార్కులు అభివృద్ధి చేయబడతాయి. ప్రతి ఎకరానికి గరిష్టంగా రూ.1 కోటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. మొదటి దశలో 50 పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కుల్లో అంతర్గత రహదారులు, భూగర్భ సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, కామన్ ట్రీట్‌మెంట్ సదుపాయాలు, ఐసీటీ సేవలు, పరిపాలనా వ్యవస్థలు వంటి ముఖ్యమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయబడతాయి. అదనంగా సిద్ధంగా ఉన్న ఫ్యాక్టరీ షెడ్లు, అవసరానికి అనుగుణంగా నిర్మించిన యూనిట్లు, ప్రయోగశాలలు, గిడ్డంగులు, ఉద్యోగుల కోసం నివాస సదుపాయాలు వంటి ఇతర సౌకర్యాలు కూడా కల్పించబడతాయి.

వివరాలు

15 లక్షల ఉద్యోగాలు..

దీని ద్వారా నేరుగా 15 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అమలు చేయనుంది. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములు సేకరించే సమయంలో బాధితులకు తగిన నష్టపరిహారం లభించకపోవడం, తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడం, పునరావాస సదుపాయాలు కల్పించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు భవ్య పథకం రూపొందించబడింది. ఒకవేళ భూమి ధర ఎకరానికి రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉంటే, కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.1 కోటి వరకు మాత్రమే సహాయం చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు భరించాల్సి ఉంటుంది.

Advertisement