Ola techie: ఒలా టెకీ అరవింద్ న్నన్ ఆత్మహత్య కేసు విచారణ CCBకి బదిలీ
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగి అరవింద్ కన్నన్ ఆత్మహత్య కేసు విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB)కి అప్పగించారు. అరవింద్ కుటుంబం తరఫున సీనియర్ అడ్వకేట్ పి.ప్రసన్న కుమార్ నేతృత్వంలో ఉన్న లీగల్ టీమ్ తెలిపిన వివరాలప్రకారం,న్యాయంగా,స్వతంత్రంగా,సమయానికి పూర్తి అయ్యే విచారణకోసం కుటుంబం ఉన్నతాధికారులకు పిటిషన్ ఇవ్వడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. అంతకుముందు సాగుతున్న విచారణపై నమ్మకం లేకపోవడంతో DGP,బెంగళూరు పోలీసు కమిషనర్‌కు కుటుంబం లేఖలు రాసి,కేసు నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయని పేర్కొన్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు మొత్తం కేసు CCBకి వెళ్లడంతో అరవింద్ రాసిన ఆత్మహత్యా నోట్,కుటుంబం చూపించిన డబ్బు లావాదేవీలు,అలాగే కంప్లైంట్‌లో పేరున్న కంపెనీ టాప్ అధికారుల పాత్ర.. ప్రత్యేకంగా CEO భావిష్ అగ్గర్వాల్‌దీ.. అన్నింటినీ అధికారులు తిరిగి విచారించబోతున్నారు.
వివరాలు
భారతీయ న్యాయ సంహిత 108 సెక్షన్ కింద కేసు నమోదు
38ఏళ్ల అరవింద్ కన్నన్ 2022 నుంచి ఒలాఎలక్ట్రిక్‌తో హోమలొగేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సెప్టెంబర్ 28,2025న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం పోలీసులకు దొరికిన 28పేజీల ఆత్మహత్యా నోట్‌లో మానసిక వేధింపులు, బకాయి చెల్లింపుల నిలిపివేత, పనిభారం పెరగడం వంటివి వివరించడమే కాకుండా CEO భావిష్ అగ్గర్వాల్, హోమలొగేషన్ హెడ్ సుబ్రత కుమార్ దాస్ సహా పలువురి పేర్లు ఉన్నట్లు తెలిసింది. అరవింద్ సోదరుడి ఫిర్యాదు మేరకు సుబ్రమణ్యపురం పోలీస్ స్టేషన్‌లో భరతీయ న్యాయ సంహిత 108 సెక్షన్ (ఆత్మహత్య ప్రేరేపణ)కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, అరవింద్ మృతి చెంది గంటలు గడవక ముందే ఆయన ఖాతాలో జమైన రూ.17.46లక్షల బ్యాంక్ ట్రాన్స్ఫర్‌పై కుటుంబం తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తోంది.
వివరాలు
బకాయిల్లో ఉన్న అక్రమాలను దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నం
ఈ డబ్బు చెల్లింపును వారు బకాయిల్లో ఉన్న అక్రమాలను దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నంగా ఆరోపిస్తున్నారు. అయితే ఒలా ఎలక్ట్రిక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, అన్ని చెల్లింపులు రెగ్యులర్ పేరోల్, ఫైనల్ సెటిల్‌మెంట్‌లో భాగమేనని, ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేసింది. కంపెనీ అరవింద్ మరణంపై విచారం వ్యక్తం చేసినప్పటికీ, వేధింపుల ఆరోపణలను తిరస్కరిస్తూ, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, అలాగే FIRపై కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపింది.
వివరాలు
షేర్ వాల్యూపై ప్రభావం
ప్రాథమిక విచారణలో కేసు చుట్టూ జరుగుతున్న పబ్లిక్ క్యాంపెయిన్ తమ ప్రతిష్ట, షేర్ వాల్యూపై ప్రభావం చూపుతోందని కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, కేసును ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒత్తిడి, బెదిరింపుల భయంతో పోలీసు రక్షణ ఇవ్వాలని అరవింద్ కుటుంబం కూడా విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు విచారణ CCBకి మార్చడంతో, కంపెనీ వర్క్ కల్చర్, అరవింద్ మరణానికి దారితీసిన పరిస్థితులు, తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు మరింత లోతుగా వెలుగు చూస్తాయని కుటుంబం, వారి న్యాయవాదులు భావిస్తున్నారు.