LOADING...
Andhra: ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి.. పూర్తయిన పనులకూ కొత్త నిబంధన.. కాంట్రాక్టర్ల ఆందోళన
కాంట్రాక్టర్ల ఆందోళన

Andhra: ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి.. పూర్తయిన పనులకూ కొత్త నిబంధన.. కాంట్రాక్టర్ల ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం రూ.50 లక్షలు మించకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. ఈ నిబంధనను ఇప్పటికే అనుమతి పొంది పూర్తయిన పనులకు కూడా వర్తింపజేయడం ప్రారంభించడంతో, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పెండింగ్‌ బిల్లులు సుమారు రూ.500 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) నవంబరులో నిర్వహించిన 'పల్లె పండగ' కార్యక్రమం సందర్భంగా రూ.1,800 కోట్ల మెటీరియల్‌ నిధులతో దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో కొన్నింటికి పూర్తిస్థాయిలో, మరికొన్నింటికి భాగంగా మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి.

వివరాలు 

పనుల రద్దుకు కలెక్టర్ల విజ్ఞప్తులు 

అయితే వీటిలో ఎక్కువ పనుల అంచనా వ్యయం ఒక్కోటి రూ.50లక్షలకు మించడంతో,వాటికి సంబంధించిన ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు (ఎఫ్‌టీవోలు)పోర్టల్‌లో తిరస్కరణకు గురవుతున్నాయి. రోడ్డు పనుల అంచనా వ్యయం రూ.50 లక్షల లోపే ఉండేలా సవరించి,మళ్లీ ఎఫ్‌టీవోలు అప్‌లోడ్‌ చేయడానికి వీలుగా, ఇప్పటికే రాష్ట్ర డేటా బేస్‌ అప్లికేషన్‌ (డీబీఏ) లాగిన్‌లో నమోదు చేసిన పనులను రద్దు (డిలీట్‌) చేయాలని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయానికి వినతులు పంపుతున్నారు. పనులను డిలీట్‌ చేసిన తర్వాత, అదే పనులకు సంబంధించిన అంచనాలను తగ్గించి తిరిగి అప్‌లోడ్‌ చేయాలన్నది వారి యోచన. ఈ విధానంతో మొదటి విడతగా ఇప్పటికే రూ.30 లక్షలు పొందిన వెండర్లకు మరో రూ.20 లక్షల చెల్లింపుకు అవకాశం ఉంటుంది.

వివరాలు 

రూపాయి కూడా అందని వెండర్లకు మొత్తం రూ.50 లక్షలు లభించే అవకాశం

అలాగే,ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందని వెండర్లకు మొత్తం రూ.50 లక్షలు లభించే అవకాశం ఉంది. అయితే ఇది తాత్కాలిక పరిష్కారమేనని, ఇప్పటికే పూర్తయిన మిగిలిన పనుల బిల్లుల పరిస్థితి ఏమవుతుందన్న సందేహాన్ని వెండర్లు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు, అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ రూ.1.60 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనిని పూర్తి చేశారు. మొదటి బిల్లు కింద ఆయనకు రూ.14 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.1.46 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఒక్కో రోడ్డు పనికి రూ.50 లక్షల పరిమితి విధించడంతో, ఇకపై గరిష్టంగా మరో రూ.36 లక్షలే లభించే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రూ.1.10 కోట్ల చెల్లింపులు ఎలా చేస్తారన్నదే ఆయనతో పాటు ఇతరుల ప్రశ్న.

Advertisement

వివరాలు 

కేంద్రానికి మినహాయింపు కోరే యోచన 

గతేడాది చేపట్టిన మెటీరియల్‌ పనులను తాజా నిర్ణయం నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర అధికారులు ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ద్వారా కేంద్రానికి లేఖ రాస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని 'పల్లె పండగ 2.0' కార్యక్రమంలో మెటీరియల్‌ నిధులతో చేపట్టే పనుల అంచనా వ్యయం తప్పనిసరిగా రూ.50 లక్షల లోపే ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి పనులకే జిల్లా కలెక్టర్లు అనుమతులు మంజూరు చేస్తున్నారు.

Advertisement