Fuel shortage: ఇంధన కొరతకు చెక్.. ఎస్మా ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సహజ వాయువు, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA)ను అమలులోకి తీసుకువచ్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడడం, పంపిణీ సమానంగా కొనసాగించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం తెలిపింది. తాజాగా పెట్రోలియం శాఖ ఎస్మాను అమలు చేసి ఇంధన సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేసింది. ఈ నిర్ణయం ప్రకారం గృహాలకు అందించే ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా, వాహనాలకు అందించే సీఎన్‌జీ సరఫరా 100 శాతం కొనసాగించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
కనీసం 80 శాతం అందేలా చర్యలు
అలాగే సహజ వాయువు గ్రిడ్ ద్వారా అనుసంధానమైన తేయాకు పరిశ్రమలు, తయారీ రంగం, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు సరఫరాలో కనీసం 80 శాతం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య సహజ వాయువు వినియోగదారులకు కూడా గత ఆరు నెలల సరఫరాలో 80 శాతం కొనసాగించాలని సూచించింది. ఇక ఎరువుల కర్మాగారాలకు గత ఆరు నెలల సగటు సరఫరాలో 70 శాతం అందించాల్సిందిగా పేర్కొంది. ఇంధన రంగానికి సంబంధించిన ఉత్పత్తి, దిగుమతులు, నిల్వలు, కేటాయింపులు, సరఫరా, వినియోగం వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం అందించాలని ప్రతి ఉత్పత్తిదారు, దిగుమతిదారు, రవాణాదారు, పంపిణీదారులకు ఆదేశాలు జారీ చేసింది.
Details
ముందస్తు జాగ్రత్తగా చర్యలు
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. దేశంలో సుమారు 33.8 కోట్ల ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా లేదా సరఫరా తగ్గినా దేశీయంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్మా అమలుతో గ్యాస్ సిలిండర్ల డెలివరీలో లేదా పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యతలో ఎలాంటి జాప్యం ఉండదని అధికారులు తెలిపారు. సరఫరా గొలుసు సజావుగా కొనసాగడం వల్ల ధరలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా తలెత్తే అనిశ్చితిని ఎదుర్కొనే రక్షణ కవచంలా ఈ చర్య ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు.
Details
ఎస్మా అంటే ఏమిటి?
ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) ను 1968లో రూపొందించారు. ప్రజల దైనందిన జీవితానికి అవసరమైన అత్యవసర సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. పౌరులకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా చూడడం, కృత్రిమ కొరతను నిరోధించడం, బ్లాక్ మార్కెటింగ్ మరియు అక్రమ నిల్వలను నియంత్రించడం కోసం ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రత్యేకంగా ఆహార భద్రతను కాపాడటం, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చట్టంలోని సెక్షన్-3 ప్రకారం నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీని నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
Details
నిల్వల పరిమితిపై ఆంక్షలు
మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడేందుకు నిల్వల పరిమితిపై ఆంక్షలు విధించడం, ధరలను నిర్ణయించడం వంటి అధికారాలు కూడా ఇందులో భాగం. సెక్షన్-5 ప్రకారం కేంద్రం తన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం అమలులో ఉన్న సమయంలో సంబంధిత రంగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెలు చేయడానికి అనుమతి ఉండదు. అవసరమైన సేవలకు విఘాతం కలిగించే వారిని వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. రవాణా, ఆరోగ్యం, విద్యుత్, ఇంధన సరఫరా వంటి కీలక రంగాలు సాధారణంగా ఎస్మా పరిధిలో ఉంటాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.
Details
గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు
గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించడం వంటి వాటిని అరికట్టేందుకు రెండు సిలిండర్ల బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ప్రస్తుతం కేవలం 15 రోజులకే ముందుగా బుకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనల కారణంగా ఈ కొత్త నిబంధనలు తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. దేశంలో గ్యాస్ కొరత తలెత్తకుండా ఉండేందుకు ఎల్‌పీజీ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Details
పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు
వాణిజ్య అవసరాల కంటే గృహ వినియోగ ఎల్‌పీజీ కనెక్షన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని చమురు సంస్థలకు స్పష్టం చేసింది. అలాగే దిగుమతి చేసుకునే గ్యాస్‌ను ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయాలని సూచించింది. ఇంధన సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం తాజాగా నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా ప్రయోగించి పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు చేపట్టింది.