Page Loader
DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 
తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.

DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అలాగే, తెలంగాణకు కేటాయించి, ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారులను తెలంగాణలో రిపోర్టు చేయాలని స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) విభాగం కార్యదర్శి తాజా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం, తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు తెలంగాణకు రావాల్సి ఉంటుంది.

వివరాలు 

వాణీప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి... జాబితాలో ఉన్నవారు 

ఏపీకి కేటాయించినా, తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల్లో వాణీప్రసాద్,వాకాటి కరుణ, రొనాల్డ్‌రాస్,ఆమ్రపాలి,ప్రశాంతి ఉన్నారు. ఐపీఎస్‌ అధికారుల్లో అంజనీకుమార్,అభిలాష్‌ బిస్త్,అభిషేక్‌ మహంతి ఉన్నారు. వాణీప్రసాద్‌ యువజన, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శిగా, వాకాటి కరుణ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా, రొనాల్డ్‌ రాస్‌ ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్‌కో సీఎండీగా, ఆమ్రపాలి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ప్రశాంతి త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. డీఓపీటీ ఆదేశాలపై ఈ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్‌ అధికారుల్లో సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని దరఖాస్తు చేసిన ఎస్‌.ఎస్‌.రావత్‌, అనంతరాముల అభ్యర్థనలను డీఓపీటీ తిరస్కరించింది. ఈ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతారు.

వివరాలు 

క్యాట్‌ ఆదేశాలతో

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన సమయంలో, సంబంధిత చట్టం ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను డీఓపీటీ రెండు రాష్ట్రాలకు విభజించింది. ఈ కేటాయింపులు సరిగా జరగలేదంటూ, తెలంగాణలో పనిచేస్తున్న పలువురు అధికారులు అప్పట్లోనే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు వారు తెలంగాణలో కొనసాగారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌ కుమార్‌ విషయంలోనూ ఇదే జరిగింది. హైకోర్టు క్యాట్‌ ఆదేశాలను కొట్టివేసిన తర్వాత, ఆయన తెలంగాణ నుంచి రిలీవ్‌ అయి ఆంధ్రప్రదేశ్‌లో చేరి వెంటనే వీఆర్‌ఎస్‌ తీసుకొన్నారు.

వివరాలు 

ఏకసభ్య కమిటీని నియమించిన డీఓపీటీ 

మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పునఃసమీక్షించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు కేసును మూసివేసింది. ఈ నేపథ్యంలో, డీఓపీటీ మార్చి 21న ఏకసభ్య కమిటీని నియమించింది. దీని ఆధారంగా, జూన్‌లో ఆ అధికారులను వ్యక్తిగతంగా విచారించి, వారి అభ్యర్థనలను తిరస్కరించింది. ఈ మేరకు, డీఓపీటీ తెలంగాణలో రిలీవ్‌ అయిన అధికారులకు ఈ నెల 16వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.