LOADING...
Ram Mohan Naidu: తుదిదశలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం:కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
తుదిదశలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం:రామ్మోహన్‌నాయుడు

Ram Mohan Naidu: తుదిదశలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం:కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
07:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7 శాతం వరకు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మంగళవారం ఆయన భోగాపురం ప్రాజెక్ట్‌ ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక సవాలుగా స్వీకరించి, ఎదురైన ప్రతీ ఆటంకాన్ని అధిగమిస్తూ పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో టెస్టింగ్‌ ఫ్లైట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

వివరాలు 

భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, "ఇక్కడ పనులు వేగంగా కొనసాగుతుండటంతో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఉత్సాహాన్ని సంతరించుకుంటాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రధాన కేంద్రమవుతుంది. ఇక్కడ ఐదు స్టార్ హోటళ్లు కూడా ఏర్పడనున్నాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం," అని చెప్పారు. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీని భోగాపురంలో స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత 18 నెలల్లో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలను ప్రారంభించామని, టాక్సీవేలు, రన్‌వేలు వేగంగా మరియు ఉత్తమ నాణ్యతతో నిర్మాణం అవుతున్నాయని వివరించారు.

వివరాలు 

పారిశ్రామిక సదస్సులో విమానయాన రంగానికి సంబంధించిన అనేక సంస్థలకు ఆహ్వానం 

నావిగేషన్‌ వ్యవస్థలు, ట్రాఫిక్ కంట్రోల్ అంశాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, దేశీయంగా,అంతర్జాతీయంగా కనెక్టివిటీని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. విశాఖపట్నం త్వరలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) హబ్‌గా మారబోతోందని, అందులో భోగాపురం ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెలలో విశాఖలో జరగనున్న పారిశ్రామిక సదస్సులో విమానయాన రంగానికి సంబంధించిన అనేక సంస్థలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. "భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించనున్నాం," అని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.