Amaravati: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం.. ప్రణాళిక నివేదిక సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.2,534 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనుండగా, దీనికి సంబంధించిన ప్రణాళిక నివేదికను కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం సంబంధిత సంస్థ పంపించింది. ఇందులో కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి రూ.1,299.08 కోట్లు, కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల కోసం రూ.1,234.91 కోట్లు కేటాయించారు. ఈ సముదాయంలో వివిధ కేంద్ర కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటవుతాయి. అలాగే అమరావతిలో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల నివాస భవనాలు నిర్మించాలని నిర్ణయించారు.
వివరాలు
పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ సదస్సుల కేంద్రం
కేంద్ర గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్‌డీఏ 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో కార్యాలయ సముదాయం, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మించనున్నారు. ప్రాజెక్టు అమలుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ సదస్సుల కేంద్రాన్ని నిర్మించనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ వెల్లడించింది.